సరస్‌‌‌‌‌‌ మేళా.. నగరంలో పల్లె సందడి

సరస్‌‌‌‌‌‌ మేళా.. నగరంలో పల్లె సందడి
  •  ఈ నెల 7 నుంచి 18 వరకు హెచ్‌‌‌‌ఎండీఏ గ్రౌండ్స్‌‌‌‌లో నిర్వహణ 
  • దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు ప్రత్యేక స్టాళ్లు 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: నగరవాసులకు పల్లె ఉత్పత్తులను పరిచయం చేసేందుకు ఈ నెల 7 నుంచి 18వ తేదీ వరకు హైదరాబాద్‌‌‌‌లో సరస్‌‌‌‌ మేళా నిర్వహించనున్నారు. ఐమాక్స్‌‌‌‌ థియేటర్‌‌‌‌ పక్కన ఉన్న హెచ్‌‌‌‌ఎండీఏ గ్రౌండ్స్‌‌‌‌లో జరిగే ఈ ప్రదర్శనకు సెర్ప్‌‌‌‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా పంచాయతీరాజ్‌‌‌‌, గ్రామీణాభివృద్ధిశాఖ ఈ మేళాను నిర్వహిస్తోంది. తెలంగాణతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల మహిళా సంఘాలు, కళాకారులు వందలాది స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌‌‌‌ మహిళా సంఘాలు ప్రత్యేకంగా 15 స్టాళ్లను ఏర్పాటు చేయడం విశేషం.

చేనేతలు, హస్తకళలు.. నోరూరించే పిండివంటలు

పోచంపల్లి, గద్వాల, నారాయణపేట చేనేత చీరలు, కలంకారి కళాకృతులు, ఎంబ్రాయిడరీ చీరలు, బంజారా హస్తకళలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. వీటితోపాటు హెర్బల్‌‌‌‌ ఉత్పత్తులు, జూట్‌‌‌‌, లెదర్‌‌‌‌ బ్యాగులు, చెక్క బొమ్మలు, ఆర్గానిక్‌‌‌‌ ఆహార పదార్థాలు, పచ్చళ్లు, పొడులు, పిండివంటలు, మిల్లెట్‌‌‌‌ ఉత్పత్తులు అందుబాటులో ఉండనున్నాయి. వివిధ రాష్ట్రాల వంటకాల రుచులను అందించేందుకు లైవ్‌‌‌‌ ఫుడ్‌‌‌‌ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. మహిళల నైపుణ్యానికి మార్కెటింగ్‌‌‌‌ సదుపాయాలు కల్పించడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. గ్రామీణ మహిళలు తయారుచేసిన నాణ్యమైన ఉత్పత్తులను కొనుగోలు చేసి వారిని పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించాలని కోరారు. కుటుంబసమేతంగా మేళాను సందర్శించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.